రోజు పెద్దది... ఏడాది చిన్నది!
శుక్రుడు

* భూమి నుంచి వీనస్కి 261 మిలియన్ కిలోమీటర్ల దూరం* సూర్యుడి నుంచి వీనస్కి 108.2 మిలియన్ కిలోమీటర్ల దూరంచిన్ను: స్పేసీ! ఏదో గ్రహంపైకి దిగుతున్నట్టున్నామే... నిన్నే చెప్పావుగా గుర్తొచ్చింది. ఇది శుక్రగ్రహమే అనుకుంటా. అబ్బ ఎంత బాగుందో. వీనస్ అన్నా ఇదే కదూ...
స్పేసీ: అవును చిన్నూ! ఈ గ్రహం మీ భూమి పక్కనే ఉంటుంది. సూర్యుడి నుంచి రెండోది. దీని గురించి చెప్పడానికి బోలెడు సంగతులున్నాయ్!చిన్ను: అటు చూడు సూర్యోదయం అవుతున్నట్టుందే...స్పేసీ: అవునవును. మనం అడుగుపెట్టింది పొద్దుపొద్దున్నే మరి. కానీ ఓ తమాషా గమనించావా?చిన్ను: ఏంటబ్బా?స్పేసీ: సూర్యుడు ఉదయిస్తోంది పడమర వైపు తూర్పువైపున కాదు. సూర్యుడు మీ దగ్గర్లా కాదు... పడమర ఉదయించి తూర్పున అస్తమిస్తాడు.చిన్ను: ఎందుకలా?స్పేసీ: శుక్రుడు అన్ని గ్రహాల్లా కాకుండా... వ్యతిరేక దిశలో సూర్యుడి చుట్టూ తిరుగుతాడు కాబట్టి!చిన్ను: ఓహో అలాగా!
స్పేసీ: ఇంకో విషయం... అన్ని గ్రహాల్లో ప్రకాశవంతమైంది శుక్రుడే.చిన్ను: అందుకేనా అలా మెరిసిపోతున్నాడు. అదేంటో స్పేసీ! ఇక్కడ చాలా వేడిగా ఉన్నట్టుందీ...స్పేసీ: అవును మరి గ్రహాలన్నింటిలో వేడి ఎక్కువగా ఉండేది ఇక్కడే.చిన్ను: కానీ సూర్యుడికి దగ్గరగా ఉండేది బుధ గ్రహమని మా నాన్న చెప్పారే...స్పేసీ: నిజమే కానీ ఈ గ్రహంపై వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇదేమో సూర్యుడి నుంచి వచ్చే వేడిని పట్టి ఉంచుతుంది. అందుకే ఇక్కడ ఏకంగా 462 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందోయ్! నువ్వు ఈ స్పేస్ సూట్ వేసుకున్నావు కాబట్టే ఉండగలిగావ్! లేదంటేనా అంతే!చిన్ను: బాబోయ్ ఎంత వేడో!స్పేసీ: నీకో ఆసక్తికరమైన సంగతి చెప్పడం మరిచా... ఇక్కడ ఒక్క రోజు మన భూమిపై 243 రోజులకు సమానం. కానీ విచిత్రంగా సంవత్సరానికి మాత్రం 225 రోజులే. మన లెక్కల ప్రకారం ఒక్క రోజు పూర్తి కాకుండానే కొత్త సంవత్సరం వచ్చేస్తుందన్నమాట. అంటే శుక్రగ్రహం దాని చుట్టూ అది తిరగడానికి 243 రోజులుపడితే సూర్యుడి చుట్టు తిరగడానికి మాత్రం 225 రోజులే.చిన్ను: ఓ.... అవునా! భలే భలే. ఇక్కడ ఎవరూ లేరు కానీ ఉంటే... వాళ్లకి పండగే. ఎంచక్కా రోజూ హ్యాపీ న్యూ ఇయరే.స్పేసీ: హా... అవును చిన్నూ.చిన్ను: ఈ గ్రహానికీ మా భూమికీ పోలికలేమైనా ఉన్నాయా?స్పేసీ: ఎందుకులేవు. ఆకారం, ద్రవ్యరాశి వంటి విషయాల్లో చాలా దగ్గర పోలికలున్నాయి. ఇక్కడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అందుకే శుక్రుడిని, భూమిని కవల గ్రహాలు అంటారు.చిన్ను: కానీ ఇక్కడ వాతావరణం చాలా తేడాగా ఉన్నట్టుందే...స్పేసీ: రూపంలో కొంచెం ఒకేలా ఉన్నా వాతావరణంలో చాలా తేడాలున్నాయ్ చిన్నూ! ఏమనుకుంటున్నావో కానీ ఇక్కడ మామూలుగా అయితే నువ్వు ఉండలేవు. ఇదిగో చూడు కనిపించే మేఘాలన్నీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో నిండి ఉంటాయి. ఒక్కనీటి బొట్టూ కనిపించదు దీనిపై. ఇంకా వేలల్లో అగ్నిపర్వతాలుంటాయిక్కడ.చిన్ను: నువ్వు తీసుకొచ్చావు కాబట్టి సరిపోయిందిగానీ లేదంటే ఇక్కడకు రాలేమేమో!స్పేసీ: అంతేగా... ఇప్పటి వరకు మీ వాళ్లెవరూ దీనిపై కాలుపెట్టలేదు.
చిన్ను: అవును కదా. అబ్బ స్పేసీ! కాళ్లు లాగుతున్నట్టున్నాయి. వికారంగా కూడా ఉంది.స్పేసీ: అయ్యో! సముద్రంలోపల కిలోమీటరు దూరం వెళితే ఎలా ఉంటుందో ఇక్కడ నిల్చుంటే అంతే ఒత్తిడి ఉంటుంది. అందుకే అలా అవుతోంది నీకు.చిన్ను: ఓ... అదా సంగతీ! ఎంతకీ ఇక్కడ చీకటి పడట్లేదేం?స్పేసీ: హ్హ హ్హ... ఇందాకే చెప్పాగా రోజు గడవాలంటే చాలా సమయం ఇక్కడ అని. అందుకే చీకటి పడటమూ లేటే. ఒకవేళ చీకటి పడ్డా చందమామే ఉండదు...చిన్ను: అరెరే! పోన్లే ఇంకా చాలా గొప్పలే ఉన్నాయ్గా.స్పేసీ: ఇప్పటికే లేటయ్యింది. పద పద స్పేస్జట్లో కూర్చో. మన ప్రయాణం మొదలుపెట్టాలి.చిన్ను: అది సరే... మనం గమనించుకోనేలేదు... టామీ ముందే ఎక్కేసి కూర్చున్నట్టుందే...స్పేసీ: పద ఎక్కి కూర్చుందాం!చిన్ను: మరి రేపు ఎక్కడికివెళదాం...స్పేసీ: సస్పెన్స్...
No comments:
Post a Comment