బహు దూరపు... బాటసారి!
* భూమికీ నెప్ట్యూన్కీ మధ్య దూరం 4.3 బిలియన్ కిలోమీటర్లు
* సూర్యుడికీ నెప్ట్యూన్కీ మధ్య దూరం 4.495 బిలియన్ కిలో మీటర్లు
స్పేసీ: ఇంకొద్ది సేపట్లో వేరే గ్రహానికి చేరుకోబోతున్నాం. ఇంతలో ఇదిగో మీ ఇంటికి ఫోన్ కలిపా. అమ్మతో మాట్లాడు..
చిన్ను: అమ్మా! ఏం కంగారు పడకు. నేను బాగానే ఉన్నా. అనుకోకుండా గ్రహాలన్నీ చూడ్డానికి అంతరిక్షంలోకి వచ్చేశా. స్పేసీ దగ్గరుండి నాకన్నీ చూపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. మరో రోజులో ఇంటికొచ్చేస్తాలే. అప్పుడు మిగిలిన విషయాలన్నీ చెప్తా. సరేనా. బైబై.
స్పేసీ: ఇక బెంగ తీరినట్లేనా.
చిన్ను: ఓఓ. శుభ్రంగా. ఏంటీ ఈ గ్రహం ఎంతకీ రావట్లేదు.
స్పేసీ: ఇది అంత దగ్గరేం కాదు మరి. సూర్యుడి నుంచి ఎనిమిదో గ్రహమే నెప్ట్యూన్. సౌర కుటుంబంలో అతి దూరంగా ఉన్నదిదే.
చిన్ను: ఇదిగో వచ్చేశాం. దీనిమీదైనా దిగనిస్తావా లేదా?
స్పేసీ: ఒకటి చెప్తా. తర్వాత నీ ఇష్టం. ఇక్కడ గంటకు 2100 కిలోమీటర్ల వేగంతో గాలేస్తుంది. ఒక వేళ ఇంత గాలి మీ భూమ్మీద ఉందనుకో. అక్కడ నువ్వు నిలబడ్డావ్ అనుకో. హైదరాబాద్ నుంచి విజయవాడకు అటూఇటూగా ఏడు నిమిషాల్లో ఎగిరి పడతావ్.
చిన్ను: వామ్మో! వద్దులే. మనం ముగ్గురం ఇందులోనే ఉందాంలే. అన్నట్టు దీని పేరేంటన్నావ్. నెప్ట్యూన్ కదూ.
స్పేసీ: అది మీ రోమన్ సముద్ర దేవుడి పేరంటుంటారు. 1846లో మొదటగా దీన్ని గుర్తించింది మీ శాస్త్రవేత్త లి వేరియర్.
చిన్ను: మా వాళ్లు నిజ్జంగా గ్రేట్ స్పేసీ! ఇంత దూరంలో ఉన్నదాన్నీ భూమి నుంచే గుర్తించేశారు. పాపం ఇంత దూరాన్న ఉన్న ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరిగిరావాలంటే చాలా కష్టమేనేమోకదా.
స్పేసీ: ఇలా చెబితే అలా పట్టేస్తావ్ నువ్వు. అందుకే అన్నీ చెప్పాలనిపిస్తోంది నాకు. నువ్వు అనుకున్నది నిజమే చిన్నూ! మీభూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది కదా. అలాంటి సంవత్సరాలు దీనికి 165 కావాలి.
చిన్ను: వామ్మో! ఇక్కడ స్కూలుంటే జన్మలో ఒక్కసారి కూడా వేసవి సెలవులు రావేమో!
స్పేసీ: ఇక్కడ సంవత్సరం అంత పెద్దదిగానీ.. రోజు మాత్రం చిన్నది. 16.6 గంటల్లోనే ఇది తన చుట్టూ తాను తిరిగేస్తుంది.
చిన్ను: అంటే ఇక్కడ బడుంటే తొందరగా ఇంటి బెల్లు కొట్టేస్తారన్నమాట.
స్పేసీ: అసలు ఇక్కడ అడుగే పెట్టలేమంటే నువ్వు బడంటావ్. ఇక్కడ ఎప్పటికప్పుడు తుపానులొచ్చేస్తుంటాయ్. ఈదురు గాలుల్లో నిలబడటమే కష్టం. కల్లోల వాతావరణం. చూస్తుంటే అర్థం కావట్లేదా?
చిన్ను: అవును. లోపల్నించి చూస్తున్నా హోరుగాలి తెలుస్తోంది. ఆ గాలికి ఇంత బరువున్న నీ స్పేస్ జట్ కూడా ఎగిరెగిరి కిందికి చతికిలబడుతోంది. కాస్త చలీ తెలుస్తోంది.
స్పేసీ: అంటే బయట వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకో. నా స్పేస్జట్ గబుక్కున కిందకి పడుతోంది చూశావా. గురుడి తర్వాత ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ కాబట్టే ఇలా. ఇక చలి అంటావా. బయట సరాసరి ఉష్ణోగ్రత -214డిగ్రీల సెల్సియస్. బయటకెళ్లి నిలబడితే నువ్వు అక్కడికక్కడే గడ్డ కట్టేస్తావంతే.
చిన్ను: అయ్యబాబోయ్! నేనేమన్నా వెళతానన్నానా? ఊరికే భయపెట్టేస్తావ్. కొంచెం కిటికీ తెరవనా. తాజా గాలి లోపలికొస్తుందేమో.
స్పేసీ: వద్దొద్దు. ఆ గాల్లో టామీకీ నీకూ ఊపిరాడదు. ఇక్కడ వాతావరణంలో 80శాతం హైడ్రోజన్, 19శాతం హీలియం ఉంటాయి. మీథేన్, ఇతర వాయువులు ఇంకొంచెంలో ఉంటాయి. వీటన్నింటి కారణంగానే ఇదీ ముదురు నీలి రంగులోనే ఉంటుంది. ఇక నేలంతా మంచేగా. అందులో అమోనియా, నీరు, అమోనియం హైడ్రోసల్ఫైడ్, మీథేన్లు కలిసి మంచులాగే ఉంటాయి. వీటన్నింటి వల్లే ఇది మన కంటికి నీలం రంగులో కనబడుతోంది.
చిన్ను: నిజమే కాబోలు. యురేనస్లాగే దీనికీ బయట రింగులు కనిపించాయి.
స్పేసీ: బాగానే పరిశీలించావ్. దీనికి ఐదు వలయాలున్నాయని శాస్త్రవేత్తలు లెక్కలేశారు. కబుర్లతో మనకు ఏం తెలియట్లేదుగానీ.. అప్పుడే ఇక్కడ చీకటి పడిపోతోంది. చుట్టూ ఆకాశంలో చూశావా. దీనికి 14 చందమామలు మరి. అదిగో ఆ మూలన పెద్దగా కనిపిస్తోందే అది దీని అతి పెద్ద చందమామ. పేరు ట్రిటోన్. నెప్ట్యూన్ని కనిపెట్టిన 17 రోజులకే దీన్నీ కనిపెట్టారు.
చిన్ను: బాగుంది. ఇంక బయల్దేరేద్దాం స్పేసీ! బాగా అలసటగా ఉంది.
స్పేసీ: అలాగే. దార్లో బోర్ కొట్టకుండా ఇంకొన్ని కబుర్లు చెబుతూ ఉంటా. నీకేమన్నా డౌట్స్ ఉన్నా అడుగు. లేదంటే నే చెప్పింది వింటూ ఉండు. సరేనా!
No comments:
Post a Comment