పగలు మంట రాత్రి మంచు!
బుధుడు

* బుధ గ్రహానికీ సూర్యుడికీ మధ్య దూరం 57.91 మిలియన్ కిలోమీటర్లు
* బుధుడికీ భూమికీ మధ్య దూరం 77 మిలియన్ కిలోమీటర్లు
చిన్ను: స్పేసీ! ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం?
స్పేసీ: సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహంపైకి.
చిన్ను: నాకు తెలిసిపోయిందిలే.. బుధగ్రహం పైకే కదా...
స్పేసీ: తెలివైనవాడివిలే. భలేగా కనిపెట్టేశావ్!
చిన్ను: బాబోయ్ ఏంటీ ఇక్కడ కూడా ఎండలిలా మండిపోతున్నాయ్?
స్పేసీ: అదా! ఇదీ... సూర్యుడి పక్కనే ఉందిగా. అందుకే ఎండలు ఎక్కువ.
చిన్ను: నేను చదువుకున్నా... ఈ బుధ గ్రహాన్నే మెర్క్యురీ అంటారు ఇంగ్లిషులో కదా.
స్పేసీ: అవునవును. మరేమో నీకు తెలియని సంగతులు చెప్పనా... ఈ గ్రహానికి ఎంత వేగమో అంత నెమ్మది. ఎంత వేడో, అంత చల్లన. అదెలా అని ఆశ్చర్యపడకు. మీ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది కదా. అదే ఈ గ్రహమైతే కేవలం 88 రోజుల్లోనే తిరిగేస్తుంది.
చిన్ను: సూర్యుడి చుట్టూ ఫా....... స్ట్గా తిరిగేది ఇదేనా?
స్పేసీ: అవును. కానీ దీని చుట్టూ ఇది తిరగడంలో మాత్రం చాలా నెమ్మదే. భూమి 24 గంటల్లో తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే, ఇది మాత్రం 1,416 గంటల్లో తిరుగుతుంది. అంటే మీకు 59 రోజులైతే దీనికి ఒక్క రోజన్నమాట.
చిన్ను: ఇదంతా సరే కానీ... ఏంటీ! ఈ గ్రహం దగ్గర్నించి చూస్తే సూర్యుడు ఇంత పెద్దగా కనిపిస్తున్నాడు?
స్పేసీ: ఇందాకే చెప్పాగా సూర్యుడికి అన్నింటి కంటే దగ్గరగా ఉండే గ్రహం ఇదే అని.
చిన్ను: ఇక్కడా పగలూ రాత్రి ఉంటాయా?
స్పేసీ: హా. మీ భూమిపై ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ ఉంటేనే అల్లల్లాడిపోతారు. అదే ఇక్కడ పగలు ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 430 డిగ్రీల సెల్సియస్. కానీ రాత్రి పూట మాత్రం అతి చల్లగా మారిపోతుంది. అప్పుడు ఉష్ణోగ్రత ఎంతంటే.. -170 డిగ్రీల సెల్సియస్. అలా ఎందుకో తెలుసా? దీనిపై వాతావరణం దాదాపుగా ఉండనే ఉండదు. అంతేకాదూ... శబ్దం వినిపించాలంటే గాలి ఉండాలి కదా. ఇక్కడ గాలులే ఉండవు కాబట్టి ఇక్కడ నా మాటలు, మీ మాటలు మామూలుగా అయితే వినిపించవు. ఇదిగో ఈ ప్రత్యేక హెడ్ఫోన్స్ పెట్టుకోవడం వల్లే మనం వినగలుగుతున్నాం. లేదంటే ఎంత అరిచినా వినపడదిక్కడ.
చిన్ను: నా శరీరం చాలా తేలికైపోయినట్లుంది.. స్పేసీ!
స్పేసీ: దానికీ కారణం ఉందిలే. నీ బరువు భూమిపై 27 కిలోలుంటే... ఈ బుధగ్రహంపై తూగి చూసుకుంటే 8.5 కిలోలే ఉంటావ్. ఇక్కడ గురుత్వాకర్షణశక్తి చాలా తక్కువ కదా అందుకే!
చిన్ను: ఇక్కడా చంద్రుడు కనిపించడం లేదేంటీ?
స్పేసీ: అయ్యో ఈ గ్రహానికి కూడా ఉపగ్రహమేం లేదు. అదే చిన్నూ! నువ్వన్న చందమామ బుధుడికి ఒక్కటి కూడా లేదు.
చిన్ను: అలాగా... సరేలే. టామీకి ఆకలేస్తున్నట్టుంది ఏదైనా పెట్టవూ?
స్పేసీ: తప్పకుండా చిన్నూ! నా దగ్గర కొన్ని మాత్రలున్నాయి. అవి ఇద్దరూ వేసుకోండి. ఆకలే వేయదు...
చిన్ను: అవునా! అలా కూడా ఉంటుందా?
స్పేసీ: ఈ మాత్ర ఒక్కటి వేసుకుంటే రోజంతా నీరసమే రాదు...
చిన్ను: థాంక్యూ స్పేసీ!
స్పేసీ: రేపొద్దున్నే గురుగ్రహానికి ప్రయాణం....
చిన్ను: చాలా ఎక్సైటింగ్గా ఉంది స్పేసీ... గ్రహ విహారం చేస్తుంటే...
స్పేసీ: అవునవును... సర్లే రేపు హుషారుగా ఉండాలంటే విశ్రాంతి తీసుకోవాలిక! పదండి మరి!
No comments:
Post a Comment