మహా చల్లటి గ్రీకు వీరుడు
యురేనస్

* యురేనస్కీ భూమికీ మధ్య దూరం 2.6 బిలియన్ కిలోమీటర్లు.
* యురేనస్కీ సూర్యుడికీ మధ్య దూరం 2.871 బిలియన్ కిలోమీటర్లు.
చిన్ను: ఇంకో గ్రహానికి ఎక్కడికో వచ్చేశాం. పద పద దిగుదాం టామీ!
స్పేసీ: ఆగండాగండి. ఎక్కడికీ దిగేది?
చిన్ను: (బాధగా ముఖం పెట్టి) అదేంటి స్పేసీ అలా అడుగుతావ్. ఇంత దూరం వచ్చాక ఇక్కడ కూడా దిగొద్దంటున్నావ్?
స్పేసీ: అయ్యో! ఎందుకు అడ్డు చెబుతున్నానో తెలుసుకోవా?
చిన్ను: సరే.. ఎందుకు వద్దు? ఇదసలు ఏ గ్రహం?
స్పేసీ: దిగకుండా లోపల కూర్చునే నే చెప్పినవన్నీ వినాలి. ఇది యురేనస్. సూర్యుడి నుంచి ఏడో గ్రహం. విశ్వంలో గురుడు, శని తర్వాత అతి పెద్ద గ్రహం.
చిన్ను: అంత దూరం తీస్కొచ్చేశావా మమ్మల్నీ!
స్పేసీ: అవునర్రా! నేనైతే తీసుకొచ్చాగానీ. మీ భూమి నుంచి సర్ విలియం హెర్షల్ అక్కడుండే దీని ఉనికిని గుర్తించాడు. ఎప్పుడంటే 1781లో. గ్రేటే కదా.
చిన్ను: అక్కడుండే తెల్సుకున్నాడంటే చాలా గొప్పేగానీ మేం ఒక్కసారి కిందకు దిగుతాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్!
స్పేసీ: అంత మారాం చేస్తున్నావెందుకు? అసలు ఇక్కడ విషయం ఏంటో తెలిస్తే ముందు నువ్వే దిగనంటావు.
చిన్ను: అంత ప్రమాదం ఏంటసలు?
స్పేసీ: ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత -224డిగ్రీల సెల్సియస్. ఇంత చలి ఈ విశ్వంలోనే మరెక్కడా లేదు.
చిన్ను: ఓర్నాయనోయ్! నిజమా. మా ఇంటి దగ్గర ఓసారి 2 డిగ్రీలొస్తేనే నేను గజగజలాడిపోయాను. అయినా ఇప్పుడు మాకు స్పేస్ సూట్లు ఉన్నాయిగా. ఏం కాదేమోలే.
స్పేసీ: అదొక్కటే కాదు చిన్నూ! ఇక్కడ గాలి చాలా గట్టిగా వీచేస్తుంది. దిగావో నువ్వు ఎగిరిపోతావ్ అంతే. ఎక్కడికో తెలీదు. తర్వాత వెతకడం నా వల్లయితే కాదు. మీ భూమ్మీద తుపానులొచ్చినప్పుడు గాలి వేగం గంటకు 100, 150 కిలోమీటర్లు దాటితేనే అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ఏకంగా గంటకు 900 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేస్తుంటాయ్. అదీ అస్తమానూ!
చిన్ను: వామ్మో! అయితే వద్దులే. మనం దీంట్లోనే కూర్చుని బయటకు చూస్తూ కబుర్లు చెప్పుకొందాం. ఇంతకీ ఈ గ్రహం పేరేంటీ యురేనస్ అని వెరైటీగా ఉంది.
స్పేసీ: అది మీ గ్రీకు దేవుడి పేరు అంటుంటారు.
చిన్ను: చూడ్డానికి నీలంగా భలేగా ఉందే.
స్పేసీ: హా! దీని నేల మీద నీరు, అమోనియా, మీథేన్, ఐస్ క్రిస్టళ్లు అన్నీ కలిసి ఉంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువ కాబట్టి అంతా గడ్డకట్టేసే ఉంటాయి. అందుకే ఈ గ్రహాన్ని ఐస్ జెయింట్ అనీ పిలిచేస్తుంటారు. నేల లోపల ఎక్కువగా రాళ్లు, ఇనుము ఉంటుంది. ఇంకా దీని గాలిలో 83శాతం హైడ్రోజనే. 15శాతం హీలియం. మిగిలినవి మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్లాంటి వాయువులుంటాయి. వీటన్నింటి వల్లే ఇది చూడ్డానికి లేత పచ్చ, నీలం రంగుల్లో కనిపిస్తుంది.
చిన్ను: రంగు వెనకాల పెద్ద చరిత్రే ఉందైతే. అద్సరే. ఇది మూడో అతి పెద్ద గ్రహమన్నావుగా. మరి సూర్యుడి చుట్టూ తొందరగా తిరిగేస్తుందా?
స్పేసీ: మీ భూమికి 365రోజులు పడితే దీనికి 84 సంవత్సరాలు పడుతుంది ఏకంగా. ఇక 17 గంటల 14 నిమిషాల్లోనే దాని చుట్టూ అది తిరిగేస్తుంది. అంటే రోజంటే మీకన్నా తక్కువసేపేగా.
చిన్ను: అవును మరి పెద్ద గ్రహం కాబట్టి దాని చుట్టూ అది వేగంగా తిరిగేస్తుందేమో!
స్పేసీ: ఇది మీ భూమి కంటే చాలా పెద్దది. పద్నాలుగు భూముల్ని తక్కెడలో వేసి మరో వైపున దీన్ని పెడితే ఇదే ఎక్కువ తూగుతుంది.
చిన్ను: అయితే చాలా పెద్దదన్నమాటే. నిన్న శనిగ్రహం దగ్గరకెళ్లినప్పుడు దానికి చుట్టూ రింగులున్నట్లు దీనికీ కొంచెం ఉన్నాయి కదా.
స్పేసీ: అవునూ! దీనికీ చుట్టూ వలయాలుంటాయి. ఇప్పటి వరకూ దీని చుట్టూ 13 వరకూ రింగుల్లాంటివి ఉన్నట్లు గుర్తించారు. ఇంకానేమో దీనికి మొత్తం 27 చందమామలున్నాయి. వాటిల్లో టైటానియా అతి పెద్దది. అదిగో కనబడుతోందే అదే అది.
చిన్ను: భలే బాగుంది. నాకైతే నువ్వున్నావు కాబట్టి ఇక్కడి వరకూ వచ్చేశా. కానీ మా వాళ్లెవరూ ఇంత దూరం రాలేరు కదూ. కనీసం వాళ్లు పంపిన స్పేస్ క్రాఫ్ట్లేమైనా వచ్చుంటాయంటావా?
స్పేసీ: ఇక్కడికి ఇప్పటి వరకు వోయేజర్2 అనే ఒకే ఒక్కటి చేరుకోగలిగింది. 1986లో. దీన్ని అతి దగ్గర నుంచి ఫోటోలు తీసి మీ భూమికి పంపింది.
చిన్ను: భూమంటే గుర్తొచ్చింది.. నాకు అమ్మ గుర్తొస్తోంది స్పేసీ! చూడాలని ఉంది..
స్పేసీ: బెంగపడకు. నా దగ్గర ముల్ ఫోన్ ఉంది. దాంట్లోంచి ఎవ్వరైనా ఎక్కడికైనా మాట్లాడొచ్చు. ఉదయాన్నే మాట్లాడిస్తా. ఇదిగో మాత్ర వేసుకుని పడుకోండి. రేపు నెప్ట్యూన్ని చూపించేస్తా.
చిన్ను: అయితే ఓకే. హాయ్ భలే భలే! మా మంచి స్పేసీ!
No comments:
Post a Comment