సోగ్గాడే..! శనినాయనా!
శనిగ్రహం

* శనిగ్రహానికీ భూమికీ మధ్య దూరం 1.2 బిలియన్ కిలోమీటర్లు
* సూర్యుడికీ శనిగ్రహానికీ మధ్య దూరం 1.433 బిలియన్ కిలోమీటర్లు
స్పేసీ: మనం శనిగ్రహం దగ్గరకు వచ్చేశాం. అదే శాటర్న్. టామీని పట్టుకుని ఇక్కడే కూర్చో.
చిన్ను: ఎందుకని స్పేసీ! మనం కిందకు దిగలేమా?
స్పేసీ: లేదు లేదు. దీనిపై అడుగుపెట్టడం చాలా కష్టం. ఇది వాయుగోళం. ఎందుకంటే దీని ఉపరితలం మీ భూమిలా గట్టిగా ఉండదు. ఇంకా గ్రహంపై 94 శాతం హైడ్రోజన్, 6 శాతం హీలియం వాయువులు ఉన్నాయి.
చిన్ను: అలాగా? సర్లే అయితే ఇక్కడి నుంచే చెప్పు దాని కబుర్లన్నీ...
స్పేసీ:చూశావా? ఈ గ్రహమేదో రింగుల వలయాలతో భలే అందంగా ఉంది...
చిన్ను: ఆ.... అవునవును. మా భూమిపై ఆయన పేరంటేనే చాలామందికి హడల్. పట్టుకుంటే వదలడని భయపడుతుంటారు. అయితేనేం? వలయాలతో భలే ముచ్చటగా ఉన్నాడే...
స్పేసీ: ఈ వలయాలే ఈ గ్రహం గొప్ప. మంచు, రాళ్లు, దుమ్ముతోకూడిన ఇవీ దీని చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటాయి.
చిన్ను: ఇది కూడా పెద్ద గ్రహంలానే ఉందే?
స్పేసీ: అవును. సూర్యుడి నుంచి ఆరోస్థానంలో ఉన్నప్పటికీ శని గ్రహం సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద గ్రహం. అంటే గురు గ్రహం తర్వాతి స్థానం దీనిదే. మీ భూమి అంత బంతులను చేసి ఈ గ్రహం మీద నింపితే ఎన్ని భూములు పడతాయో తెలుసా? సుమారు 750 వరకు!
చిన్ను: బాబోయ్! అయితే ఎంత బరువుంటుందో?
స్పేసీ: అదేం కాదు... ఇంత పెద్దగా ఉంటుంది కానీ దీని బరువు మాత్రం తక్కువే. దీని ఉపరితలం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. అందుకని ఓ పెద్ద సముద్రంలో దీన్ని వేశారనుకోండి. పైన చక్కగా తేలుతుంటుంది.
చిన్ను: భలే చిత్రంగా ఉందే ఇది...
స్పేసీ: ఏ చిన్నూ! కిటికీ తలుపులు గట్టిగా మూసేయ్. ఎందుకంటే. ఇక్కడ గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఎంతంటే గంటకు 1,800 కిలోమీటర్ల వేగంతో. మీ భూమిపై 150, 200 కిలోమీటర్ల వేగంతో వీస్తేనే ఎంతో ఎక్కువ. దాంతో పోల్చి చూడు ఎంత వేగమో నీకే తెలుస్తుంది.
చిన్ను: అమ్మో! ఎంత ప్రమాదం తప్పిందో!
స్పేసీ: చీకటి పడ్డట్టుందిగా... మనం ఈరోజుకి ఇక్కడే ఉండి రేపు బయలుదేరుదాం...
చిన్ను: ఓకే స్పేసీ! ఇక్కడ బోలెడు చందమామలు కనిపిస్తున్నాయి. అబ్బబ్బ ఎన్నెన్నో నేను లెక్కపెట్టలేకపోతున్నా...
స్పేసీ: హా. తెలిసినవే 62 చందమామలున్నాయి. వీటిల్లో 53 చందమామలకు పేర్లు పెట్టారు. అన్నింటి కన్నా పెద్దదేమో టైటాన్. ఇది బుధగ్రహం కన్నా పెద్దగా ఉంటుంది.
చిన్ను: అబ్బ అవునా...!
స్పేసీ: అంతేకాదూ... ఈ టైటాన్ చందమామకు చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. సౌర వ్యవస్థలో భూమి తరువాత టైటాన్ మాత్రమే స్థిర జలాశయాలతో కనబడుతుంది. ఇవన్నీ మీథేన్, ఈథేన్లతో ఏర్పడినవే. అందుకే భూమిపై సముద్రాలు ఉన్నట్లు ఈ టైటాన్ చందమామపై మీథేన్ సముద్రాలుంటాయి.
చిన్ను: భలే భలే! అవునూ... ఇక్కడి రోజులూ, సంవత్సరాల ముచ్చట్లు చెప్పలేదేంటీ?
స్పేసీ: మరిచిపోయా చిన్నూ! ఈ గ్రహానికి హుషారెక్కువే. 10 గంటల 42 నిమిషాల్లోనే తన చుట్టూ తాను ఒకసారి తిరిగేస్తుంది. అంటే ఇక్కడ రెండు రోజులు దాటిపోయాక గానీ మీకు ఒకరోజు పూర్తికాదన్నమాట. అదే ఏడాది దగ్గరికి వస్తే చాలా వెనకే ఇది. సెకనుకు 9.87 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని చుట్టి రావడానికి ఇంచుమించు 29 ఏళ్లు పడుతుంది.
చిన్ను: ఏమో బాబూ! నువ్వు చెప్పే గ్రహాల ముచ్చట్లు వింటుంటే... చాలా చిత్రంగా ఉంది!
స్పేసీ: హ్హ.. హ్హ.. థాంక్యూ చిన్నూ... రేపు యురేనస్కి వెళదామా...
చిన్ను: తప్పకుండా...
No comments:
Post a Comment