చిట్టి పొట్టి ప్లూటో..!
చిన్ను: స్పేసీ! అదిగదిగో చూడు. అల్లంత దూరాన ఏదో కనిపిస్తోంది ఏంటది?స్పేసీ: అదా... దాని పేరేంటో నీకు ఇదివరకే తెల్సు...
చిన్ను: అవునా! ఏంటబ్బా?
స్పేసీ: ప్లూటో...
చిన్ను: ఓహో... ఇదేనా ప్లూటో అంటే... పేరయితే విన్నా కానీ ఇతర సంగతులేమీ తెలియదు...
స్పేసీ: ఈ ప్లూటోని 1930లో గ్రహంగా గుర్తించి పేరు పెట్టారు. అయితే 2006 నుంచి మీ శాస్త్రవేత్తల గ్రహాల లిస్ట్ నుంచి వెళ్లిపోయిందిది...
చిన్ను: అవునవును విన్నాను. కానీ ఎందుకలా?
స్పేసీ: గ్రహం అంటే గుండ్రంగా ఉండాలి. అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. చుట్టూ ఉన్న వస్తువుల్ని ఆకర్షించాలి... అప్పుడే అది గ్రహం అన్నది శాస్త్రజ్ఞుల నిర్వచనం.
చిన్ను: మరి చూస్తుంటే ఇది గుండ్రంగానే ఉంది. తిరుగుతూ కనిపిస్తోంది కదా!
స్పేసీ: హా. ఆ రెండూ చేస్తుంది కానీ దాని చుట్టూ ఉన్న వస్తువులను తనవైపునకు పూర్తిగా ఆకర్షించలేకపోతోంది. అందుకే దీన్ని గ్రహంగా పరిగణించడం లేదు...
చిన్ను: మరయితే ఇప్పుడు ఏంటిది?
స్పేసీ: మరుగుజ్జు గ్రహం...
చిన్ను: ఇలాంటివి ఇంకా ఉన్నాయా?
స్పేసీ: ఎందుకు లేవూ... గుండ్రంగా ఉండి, సూర్యుడి చుట్టూ తిరిగే వాటినే మరుగుజ్జు గ్రహాలంటుంటారు...
చిన్ను: అలాగా...స్పేసీ: అదిగో... అక్కడ చూడు... మేక్మేక్ అనే మరుగుజ్జు గ్రహం కనిపిస్తోంది. ఇంకా ఇవే కాదు... హౌమియా, ఇరీస్, సిరెస్ వంటి మరుగుజ్జు గ్రహాలూ ఉన్నాయి.
చిన్ను: అయ్యోపాపం ప్లూటో..
స్పేసీ: ఏం చేస్తాంలే...
చిన్ను: అన్నట్టూ... నాకో డౌటు. మా ఇంటి దగ్గరున్నప్పుడు అప్పుడప్పుడూ ఆకాశంలోంచి ఏదో నక్షత్రం రాలినట్టు అనిపిస్తుంది? దాని గురించి నీకేమైనా తెల్సా?
స్పేసీ: అదా!! ఆకాశంలో రాత్రివేళల్లో కొన్ని మెరుస్తున్న పదార్థాలు జారిపడుతూ నక్షత్రాల్లాగా కనిపిస్తాయి. వీటిని రాలే నక్షత్రాలు అంటారు. కానీ అవి నక్షత్రాలు కానే కావు. చుక్కలు ఊడిపడవసలు.
చిన్ను: మరి అవేంటో?
స్పేసీ: అలా మెరుస్తూ రాలిపడే పదార్థాల్ని మీ వాళ్లు ఉల్కలు అంటారు.
చిన్ను: అంటే?
స్పేసీ: మరేమో అంతరిక్షంలో ఉండే కొన్ని ధూళి కణాలు, చిన్న చిన్న రాళ్లు మీ భూవాతావరణంలోకి వెళ్లినప్పుడు వాటికీ, మీ దగ్గరున్న వాతావరణంలోని గాలి కణాల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. అప్పుడు ఆ కణాల ఉష్ణోగ్రత పెరగడంతో అవి మండిపోతాయి. చీకట్లో ఆ మండుతున్న ధూళి కణాలే మీకు అలా కన్పిస్తాయ్. క్షణంలో వేగంగా దూసుకుపోతూ నక్షత్రాలే రాలుతున్నట్టు అన్పిస్తాయి.
చిన్ను: మరీ... బ్లాక్ హోల్ గురించి విన్నా. ఎక్కడుందో దార్లో ఏమైనా కనిపిస్తే చూపించవా?
స్పేసీ: కుదరదు...
చిన్ను: ఎందుకు?
స్పేసీ: బ్లాక్ హోల్ మీద పడేదేదీ వెనక్కి రాలేదు. కాంతి కూడా. కాబట్టి దాన్ని చూడలేం...
చిన్ను: పోనీ... దాని సంగతులైనా చెప్పు...
స్పేసీ: బ్లాక్ హోల్నే కృష్ణబిలం అనీ అంటారని చదువుకునే ఉంటావుగా. పేద్ద నక్షత్రాలే కాంతి కోల్పోయి అలా అవుతాయి. అంటే నక్షత్రాల జీవితకాలంలో వివిధ దశలుంటాయి. బ్లాక్‌హోల్ అనేది చివరి దశ. రెడ్ జెయింట్, వైట్‌డ్వార్ఫ్, సూపర్నోవా, న్యూట్రిన్ స్టార్ లాంటి మరికొన్ని దశలు దాటి చివరగా బ్లాక్‌హోల్ అవుతుందన్నమాట.
చిన్ను: ఓ... అవునా! గ్రహాలన్నీ తిప్పావు గానీ సూర్యుడి దగ్గరకు తీసుకెళ్లలేదేం?
స్పేసీ: అక్కడికి నా స్పేస్జెట్లో వెళ్లడం కుదరదు. ప్రత్యేకంగా ఇంకోదాన్ని తయారు చేయిస్తున్నా. అది రెడీ అయ్యాక తీసుకెళ్తాలే.
చిన్ను: అలాగే. అన్నట్టూ పుష్పక్ని మార్స్ మీద వదిలేశాం కదా.
స్పేసీ: అవును. ఇప్పుడా సంగతెందుకు గుర్తొచ్చింది?
చిన్ను: దాన్ని తీసుకుని ఇంటికెళ్లిపోవాలి... ఇప్పటికే చాలారోజులైంది. నా స్కూలు కూడా స్టార్ట్అయి ఉంటుంది.
స్పేసీ: వెళ్దువులే. ఇప్పుడు నువ్వు ఈ గ్రహాలన్నీ తిరిగి స్కూలు కెళితే ఇక నిన్నంతా చాలా స్పెషల్‌గా చూస్తారేమో! మీ భూమిపై ఎవరెస్ట్ ఎక్కి వస్తేనే ఎంతో పేరొస్తుంది. ఆ లెక్కన... నువ్వు ఇక్కడి దాకా వచ్చావంటే.... ఇక చూస్కో!
చిన్ను: అ...వు..ను... కదా! ఇదంతా సరే కానీ నువ్వెవరో మీ గ్రహమేదో ఇప్పటి వరకూ చెప్పలేదు...
స్పేసీ: హ్హ... హ్హ... హ్హ. ఇప్పుడు అడిగావా? అసలు అడుగుతావో లేదో అని అనుకుంటున్నా. నేను యూడబ్ల్యూ...
చిన్ను: అంటే?
స్పేసీ: మీరు ‘ఏఐ’ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి గొప్పగా చెప్పుకొంటుంటారుగా. అలాంటి ఏఐలు కొన్ని లక్షలరెట్లు కలిపితే యూడబ్ల్యూ అవుతుంది. అంటే యూనివర్సల్ విజ్డమ్ అన్నమాట. ఆ యూడబ్ల్యూతో తయారైన రూపాన్నే నేను.
చిన్ను: వా........వ్! భలే భలే. థాంక్యూ స్పేసీ! నువ్వు నాకెన్నో విషయాలు చెప్పావ్. అవన్నీ మా వాళ్లతో పంచుకుంటా. ఇక నన్ను ఇంటికి పంపు...
స్పేసీ: సరే పద. పుష్పక్ దగ్గరకు తీసుకెళ్లి దాంట్లో ఎక్కిస్తా...
చిన్ను: మిస్ యూ స్పేసీ...
స్పేసీ: మరేం పర్లేదు. ఇదిగో నీకో బహుమతి. నా ముల్ ఫోన్ తీస్కో. దీంతో నాతో మాట్లాడొచ్చు...
చిన్ను: హై... నువ్వు నా మంచి ఫ్రెండ్. ఓసారి మా ఇంటికి రా. నా సెలవుల్లో ఫోన్ చేస్తా. టామీ నువ్వూ స్పేసీకి బైబై చెప్పేయ్.
స్పేసీ: బైబై... జాగ్రత్తా...
( టాటా... ఇక సెలవు!)
No comments:
Post a Comment